Saturday, 14 February 2015

my grandMOTHER

మా నానమ్మకు వందనాలు



మొత్తం నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు కలిపి మా నానమ్మకు పన్నెండు మంది మనవళ్ళు, ఏడుగురు మనవరాళ్ళు, పది మంది మునిమనవళ్లు, ముగ్గురు మునిమనవరాళ్ళు. నాకు జ్ఞాపకమున్నంతవరకు అందరికి ఉగ్గుపాలు తనే పట్టింది, అందరి ఉయ్యాలలు తనే ఊపింది. అందరి చిన్ననాటి సపర్యలు ఆమే చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. నా చిన్న వయస్సులోనే మా అమ్మ చనిపోవడం వల్ల ఆమె నాకు అన్నీ తానై చూసుకునేది. తెల్లవారుఝామునే లేచి  విశాలమైన మా ఇంటి వాకిలిని ఊడ్చేది. తర్వాత ఇంట్లో ఒక్కో గదిని ఊడుస్తూ మమ్మల్నందరినీ తనే నిద్రలేపేది. ఆదివారమొచ్చిందంటే కుంకుడుకాయ రసంతో మాకు తలస్నానాలు చేయించడానికి సిద్దంగా ఉండేది. ఇల్లు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి నిరంతరం పరితపించిపోయేది. అన్ని వంటపనులు తనే దగ్గరుండి చూసుకొనేది, పెదనాన్న, నాన్న, బాబాయ్ లకు అవసరమైన సలహాలిస్తూ కనిపించేది. అమ్మలేని లోటు మాకు రానీయకుండా చూస్తోంది. మా తర్వాతి తరమైన తన మునిమనవల, మునిమనవరాళ్ళ బాగోగులు తనే చూసుకుంటోంది. అలాంటి నానమ్మకు మనవడిగా పుట్టడం నిజంగా నా అదృష్టం, అది తీర్చుకోలేని ఋణం. ఇంతమందికి ఇన్ని చేసి, ఇంకా చేస్తున్న మా నానమ్మకు చిన్న ఆరోగ్య సమస్య కూడా రాకపోవడం బహుషా ఆమె కష్టపడేతత్వం చూసి దేవుదు తనకిచ్చిన వరం అనుకుంటా! ప్రస్తుతం మా నానమ్మ వయస్సు సుమారు ఎనభై సంవత్సరాలు. వంద సంవత్సరాలకు మించి ఆమె ఆరోగ్యంగా ఉండాలనేదే దేవుడికి  మా నిరంతర ప్రార్థన.

No comments:

Post a Comment